ముంబై 9-7-2023 : ముంబై అంతటా మన తెలుగు ప్రజలచే బోనాల సంబురాలు ప్రారంభమైనాయి. ఆదివారం ఉదయం పశ్చిమ గోరేగావ్ యశ్వంత్ నగర్లోని ముంబై తెలుగు బెస్త (గంగపుత్ర) సమాజ్ ఆధీనంలోవున్న శ్రీపోచమ్మ తల్లి దేవస్థానం వద్దకు తమ ఇండ్ల నుంచి మహిళలు బోనాలను తమ నెత్తిపై ఎత్తుకొని మందిరం వరకు ఊరేగింపు తీశారు. ఆడపడుచులు తమదైన పట్టుచీరలు ధరించి, పూజ సామాగ్రిలు, కోళ్లు, చెట్ల కల్లు చేత బట్టుకొని, మరో చేతిలో పిల్లల్ని పట్టుకొని ఆనందంగా గుడికి చేరుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. మరోవైపు చుట్టుపక్కల ప్రాంతాల తెలుగువారు కూడా వచ్చి బోనాలు నిర్వహించడం వల్ల అట్టి పోచమ్మ గుడికి మంచి గుర్తింపు వచ్చిందని సమాజం యువ నాయకుడు నాగుల మల్లేష్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముంబై భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ముంబై కొంకన్ డివిజన్ కోర్డినేటర్ ప్రొఫెసర్ విజయ్ మోహితే ప్రత్యేకంగా హాజరై మొక్కుబడులు చెల్లించుకున్నారు. వీరి టీం మెంబర్లైన ముంబై నార్త్ సెంట్రల్ లోక్ సభ కోర్డినేటర్ రవీంద్ర రొకడే, చందివలి అసెంబ్లీ కోర్డినేటర్ రమేష్ చౌవల్, చార్కొప్ అసెంబ్లీ కోర్డినేటర్ సుక్క నర్సింహ, తానే సిటీ కోర్డినేటర్ మక్సుద్ ఖాన్, యూనియన్ నేత సంభజి కాషిద్, జగత్ సింగ్, వీరమల్ల మల్లేష్ తదితరులు ఉన్నారు.