ఐజెయూలో ఎన్నికల లొల్లీ... బీసీ, ఎస్సీ, ఎస్టీ లను లెక్కచేయని నిర్వాహకులు!

 

దీ సింపుల్ టైమ్స్  & తెలంగాణ లింక్, జగిత్యాల 04.07.2025 : జగిత్యాల జిల్లాలో ఈ నెల 9న జరగనున్న "టీ.యూ.డబ్ల్యూ.జే" (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ఎన్నికలు రాజకీయ మలినాలతో కుదిపేస్తున్నాయి. ఐ.జె.యూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్) కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంఘం, ఎన్నికల్లో పలు నిబంధనలకు విరుద్ధంగా అనేక చర్యలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకవైపు నామినేషన్లు – మరొకవైపు ఓట్లు !
ఓ వైపు నామినేషన్లు స్వీకరిస్తూనే, మరుసటి రోజే ఎన్నికలు నిర్వహించడం అనుచితమని సభ్యుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ప్రచారం కోసం కనీసం వారం రోజులైనా గడువు ఉంటే ఎన్నికలు సవ్యంగా జరుపుకోవచ్చని వారూ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

వాటాలపై మాటల తూటాలు – సభ్యుల తొలగింపులతో పెరిగిన ఉద్రిక్తత
ఓ వైపు ఎన్నికల ప్రక్రియ నిమిత్తం సభ్యుల ఓటర్ల జాబితాలో పలుకుబడి గల అగ్రవర్ణాలు పదుల సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సభ్యుల పేర్లను తొలగించారని తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఓటుకు అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వారిని కూడా యధేచ్చగా తొలగించడం నిరాశ కలిగిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి
జిల్లా స్థాయిలో పరిస్థితులు బాగా దిగజారిపోయాయని వర్కింగ్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. సభ్యుల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఎన్నికలు ముందుకు నడిపించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని వినికిడి.

ఎన్నికలు వాయిదా వేస్తే బాగుండు 
ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడమే లక్ష్యంగా నిర్వాహకులు పరుగు తీయడం అంతర్గతంగా అసమ్మతికి దారి తీస్తోందని. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంపై తప్పిదాలను సరిదిద్దేంతవరకూ ఎన్నికలను వాయిదా వేస్తే బాగుండు అని పలువురు సభ్యులు ఆశిస్తున్నట్లు సమాచారం.

బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు కమిటీలో రిజర్వేషన్ ఉండాల్సిందే
బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు కమిటీలో రిజర్వేషన్ లేనందున అవకాశం లభించడం లేదు, అందువలన ప్రతి పోస్ట్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సంఖ్యలకు అనుకూలంగా రిజర్వేషన్ ఉండాల్సిందని విశ్వ తెలంగాణ రిపోర్టర్ బాలే అజయ్ పేర్కొన్నారు. ఉదాహరణకు బీసీ లో 52 శాతం సంఖ్య బలం ఉంటే, 52 శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే. ఎస్సీ లు 19 శాతం ఉంటే రిజర్వేషన్ 19శాతం ఉండాల్సిందే. ఎస్టీ లు 10 శాతం ఉంటే రిజర్వేషన్ 10శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే.